Tuesday, April 22, 2008

సుందర కండ పదిహేడవ సర్గ

రాజ హంస కలువ సహితమగు
నీలి కొలనును చేరినట్లు
నింగి వెలసిన చంద్ర బింబమును
హనుమ అప్పుడు తేరి చూసెను 1

తన చల్లని కిరణ కాంతితొ
అలసిన మేనికి సేద తీర్చుచు
విలాసముగ నింగి కెగిరిన
ఇందు బింబమును హనుమ చూసెను 2

బరువు పెరిగి నీత మునిగెడి
పడవ విధముగ, బాధ నోర్చుచు
తలను దించిన, ఇందు వదనగు
సీత సాధ్విని హనుమ చూసెను 3

ఒకటె కన్నుతొ ఉన్న కొందరు
ఒంటి కర్ణము నున్న వారలు
చాట చెవుల వింత రూపులు
శంఖు చెవుల రాక్షస వనితలు 4

చప్పిడి ముక్కుతొ నున్న వనితలు
పొడుగు ముక్కుతొ వున్న వారు
సన్నని సాగిన మెడతొ కొందరైతె
గొరిగిన తలతొ ఉన్న కొందరు 5

జడలుగట్టిన తలలతొ కొందరు
పెరిగి జారిన పొట్టలతొ కొందరు
సాగి ఊగెడి స్థనంలతొ కొందరు
పాలిపోయిన ముఖముతొ కొందరు 6

వేళడు ముఖముతొ కొందరైతే
జారిన నడుముతొ మరి కొందరు
నేలకు జానెడు ఎత్తు కొందరు
చెట్టుకు సరిపడు పొడవగు కొందరు 7

గూని వీపుతొనున్న కొందరు
ఎత్తు పళ్ళు వంకర మూతుల కొందరు
సీతను కాచుచు ఆమెను చుట్టివున్న
వివిధ రీతుల వికృత రూపులను హనుమ చూసెను 8

బరిశలు పట్టిరి కొందరు యోధులు
బల్లెము త్రిప్పుచు నిల్చిరి వీరులు
కత్తులు దూసి కయ్యపు కళలతొ
అశోకవనమున పహార కాసిరి

పందుల జింకల దున్నల ఎలుగుల
ఆవుల కోతుల ఒంటెల మేకల
బోలిన అవయవ పొందిక గల్గిన
వికృతరూపులు అంతటనుండిరి

ఎత్తు పళ్ళతో నొక్కు ముక్కులతో
ఎర్రని గోళము పోలిన కన్నులతో
నల్లని బండంగ అగుపించెడి దేహముతో
వంకర చూపులు వెకిలి చేస్ఠలతో

మధువును త్రాగిన మత్తతో
రక్త మాంసములు పులిమిన తనువుతో
రోమములు నిక్క బరిచెడి రూపముతో
చెట్టును చుట్టిన అరుగు పై నుండిరి. 9-17

బాధతొ కాంతులు కరిగి పోగా
మలినము తోడై కురులు జడలు గట్టగా
కష్ట కాలమున కాంతులుడుగగా
స్వర్గము నుండి నేల రాలిన తారక లాగా 19

రామునెడబాసిన మోమున మెరుపులు పోగా
కష్టములెరుగని తనువు కృశించి పోగా
భూషణములందిన చేతులు వెలవెలబోగా
కన్నీటి ధారలు ఎండి ముఖమున గీతలుగాగా 20

బందుగులెవ్వరు చుట్టూలేక
రావణ బలమున లంకకు తేబడి
సింహపు మందల మధ్యన చిక్కిన
ఒంటరి జింకతొ పోలికలున్న 21

కోదండ రాముని పట్టపు రాణిని
అనిందితయగు జనక నందినిని
తన మనమున నిందిన సీతా మాతని
అంజని సుతుడా మధ్యన చూసెను 18

రాముని చూడక వాడిన మోముతొ
తంత్రులు తెగి మూగబోయిన వీణియ లాగ
మబ్బులు గ్రమ్మిన చంద్రుని బింబములాగ
మారుతి సీతను అచ్చట గాంచెను 22

రక్కసి మూకల బారిన చిక్కి
వికృత రుర్పుల మధ్యన నిల్చి
దు:ఖసాగరమున మునుగుతు లేచెడి
సీతను హనుమ చింతతొ చూసెను 23

గ్రహముల మధ్యన రోహిణి లాగ
ముళ్ళ పొదల నదిమిన పుష్పము లాగ
రాకాసి జనముల బరిలో మాతను
దైన్యము నిండగ మారుతి చూసెను 24

దుమ్ము ధూళులామెకు లేపన కాగ
నివురు గప్పిన నిప్పు వలెనను
బురద గుంటలొ కమలము వలెనూ
హనుమ మనము మాతను పోల్చెను 25


ఆమె శీలమే ఆమెకు రక్షగ నిలువగ
భయము నిండిన జింక కన్నులతొ
దీన వదన గా, మలిన వస్ట్రగా
మాంసము తినెడి వికృత రూపుల 26

నడుమ బేలగా నిల్చిన సీతను
కన్నులు చెమరగ నిలబడి చూసెను 27

దు:ఖపు మూటల గుట్టల మధ్య
విచిత్ర రూపులగు భటుల మధ్య
బెదిరిన లేడి కూన వలె నిల్చిన
సీతను చూసిన మారుతి వగచినను 28

జలధిని దాటి, తీరము చేరి
లంఖిణి దురిమి లంకను తిరిగి
కావలి నడిమి ఆమెను చూసి
మనమున మారుతి గంతులు వేసెను 29

నగలు లేకనే మెరిసెడి సీతను
దీనత కనులలో నిండిన మాతను
అశోక వనమున కనుగొని మారుతి
ఆనందాశృవు చెంపల కారగ 30

కరములు మోడ్చెను సిరమును వంచెను
చెమరిన కన్నుల రాముని చూచుచు
అదిరెడి పెదవుల లక్ష్మణు తలచుచు
ఆనందము మరి అవధులు మీరగ 31

అశోక వనమున తాండవమాడెను 32